Book Description
మద్రాసు నగరం ఓ మహావృక్షం లాంటిది. ఎన్ని ఊడలు దింపుకుని విస్తరించిందో! ఎన్ని జీవితాల్ని తనలో కలుపుకుందో! పేదా-గొప్పా అందర్నీ సమానంగానే చూస్తుందీ నగరం. ఈ గాలిలో ఎందరి ‘నిశ్వాసాలు’ తారల్లా వేలాడుతున్నాయో... సారీ... తారల్లా అంటే ‘పగటి తారల్లా’ తారలు ఉన్నా పగటివేళ కనిపించవు. అలాగే ఈ ‘నిశ్వాసాలూ’ కనిపించవు. కానీ ఆ నిశ్వాసాల్లోని ‘కలల’ శబ్దం మాత్రం గుండెకి వినిపిస్తూనే ఉంటుంది. మెల్లగా అక్కడ్నించి బయలుదేరాను. ఎంత ఇష్టమైన చోటునుంచి అయినా కదలక తప్పదు. ‘‘బాట నుంచి ఓ బాటకి మజిలీ’’ అదేగా జీవితమంటే..! లక్షలమంది నా చుట్టూ ఉన్నారు. కానీ నిజంగా ‘‘నా’’ వాళ్ళూ? ప్రతి మనిషి గుండెలోనూ ఈ శూన్యం ఉంటుంది. ఆడైనా మగ అయినా. ఈ శూన్యాన్ని నింపేది సృష్టిలో ఒక్కరే. అదీ ఒకసారే. ఏమో! మనసు పరిపరివిధాల ఆలోచించడం మొదలుపెట్టింది.