Book Description
ఇదో రంగుల ప్రపంచం. ఈ బిజినెస్, ‘షో...బిజినెస్’! అందుకే అనంతమైన ఆకర్షణ, డబ్బు, పేరు మాత్రమేగాక చలన చిత్ర పరిశ్రమ ‘అమరత్వాన్ని’ కూడా ప్రసాదిస్తుంది. సక్సెస్ ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు. కానీ, ఆశ మాత్రం మనసునీ, మనిషినీ వీడదు. కొన్ని వందలమందిని యీ చెన్నైలో చూశాను. వచ్చినప్పుడు కోటికోటి కలల్ని కళ్ళనిండా నింపుకుని వచ్చినవాళ్ళు- సంవత్సరాల తరబడి నిస్సారంగా, నిర్జీవంగా పాండీబజార్ చెట్ల నీడల్లో బ్రతుకు వెళ్ళదీయడాన్ని నా కళ్ళారా చూశాను. యువకులున్నారు... యువతులున్నారు. మధ్య తరగతివాళ్ళూ, నడివయసువారూ కూడా ఓ మాయలో పడి ఇక్కడికొచ్చారు. వారు తిరిగి వెళ్ళడమంటూ జరగదని నాకూ తెలుసు. కారణం ఫాల్స్ ప్రెస్టీజ్. ఈ కథల్లో కలలున్నాయి...కన్నీళ్ళున్నాయి...త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ‘స్పందించే మనసు’ కలిగి ఉండటం. నిజానికంటే ‘కల్పన’ కీ ‘కల’ కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగానే కృంగిపోతారు. ఓ ‘మెప్పు’ వారిని ఆకాశంలో నిలబెడితే, ఒక్క ‘విమర్శ’ వారిని పాతాళంలోకి తోసేస్తుంది. అంత సున్నితమైనవారు గనకనే ఇన్ని ఆటుపోట్లకి గురి అవుతారు. ఎంతో ఉత్సాహంతో, ఎంతో టేలంట్‍తో యీ పరిశ్రమకి రావాలనుకునే యువతీయువకుల్ని నిరాశపరచడంకోసం యీ కథలు వ్రాయలేదు. సరైన ‘అవగాహనతో’ రమ్మని చెప్పడానికి మాత్రమే యీ అన్‍టోల్డ్ స్టోరీస్ రాశాను.