Book Description
పుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో. నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలాచోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జెనెటిక్స్లో పిహెచ్‍డి, దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం. ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంధ్రదేశమంతటా ఉన్న చిన్నచిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు వొద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవబడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డుకిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం! అమ్మమ్మగారి ఊరు కావడమే కాకుండా, మరుగుపడుతున్న ఆచార వ్యవహారాలనీ, సంప్రదాయలనీ, అనుబంధాలనీ మాకు రుచి చూపించింది కూడా అగ్రహారమే! చిలిపితనాల చిన్నతనాలూ, కలల అలల కౌమారాలూ, జీవితాన స్థిరపడే ప్రయత్నంలో ఉద్యోగాలూ, సద్యోగాలూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ - ఇలా రకరకాల మెట్లు ఎక్కుతూ, దిగుతూ మధ్యలో ఎక్కడో, ఎప్పుడో తెలియకుండానే పారేసుకున్న అమ్మ పెట్టిన కమ్మనైన తాయిలంలాంటి ఆ ఊరి జ్ఞాపకాలు ఇవి! మన ఇంట్లోనో, పక్కనో కనిపించి పలకరించే వ్యక్తుల్లాంటివే ఈ కథల్లోని పాత్రలు! కొన్ని జరిగినవీ, కొన్ని నే విన్నవీ - వీటికి కొద్దిగా నా సొంత కవిత్వాల రంగులూ, వర్ణనలూ, ఊహలూ అద్దేసి ఆ చేనే(రా)తల కలనేతకి నేను పెట్టుకున్న పేరు ‘అగ్రహారపు కథలు’!