Book Description
పాత సంప్రదాయాల్లో పెరిగిన పండితమ్మన్యుల ఆదరణ వసుచరిత్ర, మనుచరిత్రల కున్నంతగా కళాపూర్ణోదయానికి లేకపోవటం సూరన స్వీయ సృజనాశక్తికి, అతని కాలంలోని ప్రాచీనతకు నిదర్శనం. తరువాతి కాలంలో వచ్చిన కవులు గాని లాక్షణికులు గాని అభినవగుప్తుడు ప్రతిపాదించిన రసధ్వనిసిద్ధాంతాన్ని చదవటానికి గాని, అర్థం చేసుకోవటానికి గాని ప్రయత్నించలేదు. బహుశ వారి ఆత్మలన్నీ క్షీణిస్తున్న సిద్ధాంతాల ఊబిలో కూరుకుపోయి ఉండవచ్చు. శ్లేషబంధాల నిర్మాణంలో తమ కౌశల్యాన్ని ప్రదర్శించిన వారికే వారి గౌరవం దక్కింది. విస్తారము, గంభీరములైన మానవానుభవాలను చిత్రించే రచనలేవీ వారినాకర్షించలేకపోయినవి. అందుకే రామరాజ భూషణుడు తన వసుచరిత్రలో సృజనాత్మకమైన రచనలు గాజుపూసలని, సాంప్రదాయికంగా వస్తున్న రచనలు మణిపూసలని జంకు లేకుండా చెప్పగలిగాడు.