Book Description
గత రెండు దశాబ్దాలలో శాస్త్రవేత్తలు భాషల జీవన పరిమాణాన్ని ఊహించే గణిత నమూనాలతో ముందుకు వచ్చారు. ఈ ఊహలు నిరపవాదంగా ప్రపంచ ప్రజానీకం తమ భాషా వారసత్వంలో చాలా భాగాన్ని కోల్పోబోతున్నదని చెప్తున్నాయి. చాలా వేగంగా ఆ వైపు ప్రయాణం సాగుతున్నదని కూడా చెప్తున్నాయి. ఈ రాబోయే సమస్య తీవ్రత విషయంలో ఏకాభిప్రాయం లేనప్పటికీ ఈ ఊహలన్నీ ప్రస్తుత సహజమానవభాషల్లో నాలుగింట మూడువంతులు లేదా అంతకంటే ఎక్కువ భాషలు శ్మశానంలో నడుం వరకు కూరుకుపోయి ఉన్నాయన్న అభిప్రాయాన్ని మాత్రం ఏకగ్రీవంగా ఉద్ఘోషిస్తున్నాయి. మరోవైపు భాషాపరమైన ప్రపంచీకరణను ప్రచారం చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచమంతా ఒకే భాష లేదా అతికొద్ది భాషలు మాత్రమే ఉంటే దేశసరిహద్దుల కావల సమాచార వినిమయం తేలిక అవుతుందని వీరి ఆకాంక్ష.