Bhavani Phani
'జగమంత కుటుంబం నాది' అన్న తన పాటలోని తత్వాన్ని నిజ జీవితంలోనూ చూపించుకుని, 'నోరారా పిలిచినా పలకని వాడినా... ' అంటూ రక్త సంబంధం లేని ఎందరి చేతనో, నాన్నా, అన్నా, బాబాయ్ అని పిలిపించుకోవడమే కాక, ఇంకెందరో ముఖతః కలవని నాలాంటి వాళ్ళ చేత 'సిరివెన్నెలగారు' అని ఆప్యాయంగా పిలిపించుకుని ఆ పదానికే ఒక కొత్త బంధపు స్థాయిని కల్పించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి నిజమైన తమ్ముడు, అసలైన అధికారంతో ఆయన్ని 'అన్నయ్యా' అని పిలిచి, ఆయన చేత అబ్బాయ్ అని పిలిపించుకున్న శ్రీరామ శాస్త్రి గారిది ఎంతటి అదృష్టమో అని మాత్రమే కాక, 'అన్నగారిలాగే ఆయనది కూడా ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా!' అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. అన్నగారి గురించి నిజాయితీ గా తన అభిప్రాయాలని చెబుతారు ఈ పుస్తకంలో శ్రీరామ శాస్త్రి గారు.
పుస్తకంలో సగం పేజీలు, శ్రీరామ శాస్త్రి గారు తను చూసిన, తనకి తెలిసిన అన్నగారి గురించి చెబుతూ వచ్చారు. ఆ తర్వాత సగం పుస్తకంలో సిరివెన్నెల గారి బంధువులు, స్నేహితులూ,ఆత్మీయ బంధువులూ ఆయన గురించి రాసిన వ్యాసాలున్నాయి. సిరివెన్నెల గారి భార్య పద్మావతి గారు, రెండో తమ్ముడు వెంకటరామ శాస్త్రి గారు, ఆయన ఇద్దరు చెల్లెళ్లు, బావగార్లు, మనమడు, వియ్యంకులు ఇలా అనేక రకాల బంధుత్వాలున్నవారి వ్యాసాలు చదువుతుంటే ఒక్కో కోణం నించి ఒక్కోలా కనిపించిన సిరివెన్నెల గారూ, అన్ని కోణాల్లోనూ ఒకేలా ఉన్న సిరివెన్నెల గారూ కనిపించారు. అవి పూర్తిగా వారి వారి బంధాల వల్ల ఏర్పడిన అనుబంధాలు కనుక ఒక్కో బాంధవ్యం ఒక్కో అనుభూతిని మిగిల్చింది. ఇంకొందరు స్నేహితుల వ్యాసాలు కూడా అలా సిరివెన్నెల గారి వ్యక్తిత్వాన్ని వారి వారి కోణాల్లోంచి చూపించాయి.
సిరివెన్నెల గారిని ఎంతగానో ఆరాధించి, అభిమానించి, తిరిగి ఆయన అభిమానాన్ని కూడా పొందిన వెంకట్ గారి మాటలు మాత్రం, సిరివెన్నెలగారిని స్వయంగా కలవలేకపోయిన ఆయన అభిమానులంతా తప్పకుండా చదివాలి. అవి కలిగించే అనుభూతిని స్వయంగా అనుభవించి తీరాలి. వెంకట్ గారు సిరివెన్నెల గారిని వైజ్ఞానిక కవి అనడమే కాక, ఎందుకో ఎలానో కూడా ఈ పుస్తకంలో చాలా వివరంగా తెలియజేసారు. ఎలా సిరివెన్నెలగారు పరిశీలనతో, పరిశోధనతో, తర్కంతో, తార్కికతతో అంటే రీసెర్చ్, లాజిక్, రీజనింగ్ లతో ఒక సత్యాన్ని ఆకళింపు చేసుకుని, ఆ యూనివర్సల్ ట్రూత్ కి తనదైన ఒక భావ రూపాన్నిచ్చి, దానిని తన పదాలతో మెరుగులు దిద్ది, తన మర్యాద, సంస్కారాల మధ్యన గట్టిగా బిగించి, ప్రేమగా ఇష్టంగా మృదువైన స్వరంలో అందించాలని ప్రయత్నిస్తారో చాలా వివరంగా, సైన్టిఫిక్ గా గ్రాఫ్ లూ, ఫ్లో చార్ట్ ల సహాయంతో వివరించారు వెంకట్ గారు ఈ పుస్తకంలో.
ఇంకా ఈ పుస్తకంలో సిరివెన్నెల గారు రాసిన టెలిఫోన్ బుర్ర కథ, క్షీర సాగర మథనం, పునరుజ్జీవనం, తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు ఘనత లాంటి గీతాలు ఇంకా మనం ఎప్పుడూ వినని, సినిమా పాటలు కాని ఆయన రచనలకు చెందిన గ్లింప్సెస్ చాలా ఉన్నాయి. ఆయన బాల్యం నించి అనేక దశలలోని ఫోటోలు కూడా ఉన్నాయి. శ్రీరామ శాస్త్రి గారు చెప్పిన, వారి చిన్నప్పటి చిలిపి సంగతులనీ, ఆయన సన్నిహితులు ఆయనకిచ్చిన బిరుదులు సీతారామ రాత్రి, వైజ్ఞానిక కవి లాంటి ఆయనలోని మరో కోణానికి చెందిన పేర్లనీ ఈ పుస్తకంలో అనేకం ప్రస్తావించారు.
సిరివెన్నెలగారికి గురువు, అత్యంత ఆప్తుడు అయిన సత్యారావు మాస్టారు అన్నట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సూర్యుడి లాంటి వారు. ఆయన వెలుగుని, తేజస్సుని మనం చూసాం. అది ఆయనకి దగ్గరగా ఉన్న వారిపై పడి, వారి అభిప్రాయాల సిరివెన్నెలగా మనల్ని ఈ పుస్తక రూపంలో చేరింది. ఆ చల్లదనంలో తడిసి సేద తీరాలనుకుంటే ఈ పూర్ణత్వపు పొలిమేరలో పుస్తకం తప్పకుండా చదవండి. నా పూర్తి అభిప్రాయాన్ని ఇక్కడ వినండి. https://youtu.be/jQpYNI-7FTY