Book Description
‘వాక్యం రసాత్మకం కావ్యం’. చదివిన వెంటనే ఏ చిన్న ప్రయత్నం కూడా అక్కర్లేకుండానే హృదయానికి చెప్పలేని మధురానుభూతి కల్గజేసే వాక్యమైనా సరే కావ్యమే అని కదా పెద్దలమాట. అలాంటి అనుభూతి నిచ్చేదే రసం. అలా కానిదంతా నీరసమే. పద్యమైనా గద్యమైనా పాఠకులకు హృదయంగమం అయినప్పుడు కల్గే అనుభూతి మాటల కందనిది. ఊహకి దొరకనిది. అలా హృదయంలోకి చొచ్చుకుపోవాలంటే సరళమైన భాష, పొందికైన పద ప్రయోగం, కధా సంవిధానం, పాత్రోచిత చిత్రణ వంటి విషయాలతో ముడిపడి ఉంటుంది కధా రచన. మనల్ని మనం వెదుక్కోవడం మొదలుపెడితే మన బాల్యం, మనం చదువుకునే రోజుల్లోని మన గురువులు, మనని వేలు పుచ్చుకొని నడిపించిన పెద్దవాళ్ళు, ఆ కాలంలో మన జీవితాల్లో జరిగిన మధురస్మృతులు హృదయాంతరాల్లో ఎక్కడో ఉన్నవి పైకి వచ్చి చెప్పిన ఊసుల చిరు ప్రయత్నమే నా (మీ) ఆ పాత మధురాలు.