Book Description
తొలకరి జల్లులు పడి నేల చిత్తడి చిత్తడిగా తయారైంది. వానతోపాటు వచ్చిన చిరుగాలికి పారిజాతం పువ్వులు జలజల రాలి నేలమీద తివాచీ పరిచాయి. అరుగుమీద పడక కుర్చీలో కూర్చున్న రాఘవకి పారిజాతం పువ్వులు చూడగానే సాకేత్ గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు వాడు తన చిట్టి చిట్టి చేతులతో చెట్టు క్రింద పడిన పువ్వుల్ని ఏరి గుప్పెళ్ళ నిండా తెచ్చి చూపించేవాడు. వాటిని అల్మారాలో ఉన్న చిన్నికృష్ణుడి విగ్రహం ముందు పోసేవాడు. బుధ్ధిగా చేతులు కట్టుకొని ‘‘చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ! అని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు. వాడి చిన్నతనం కళ్ళకి కట్టినట్టు, ఈ మధ్యే జరిగినట్టుగానే అనిపిస్తోంది. అప్పుడే వాడు పెద్దవాడు అయిపోయాడా? లేదా నాకు ముసలితనం ముందే వచ్చేసిందా? కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది?