Book Description
అమ్మ భాష - తియ్యందనాల మన తెలుగు భాష పురిటి గడ్డమీద కొయ్యబారే దుస్థితి దాపురించింది. నేటి యువత తెలుగు రాయలేక చదవలేక ఆపసోపాలు పడుతున్న దయనీయ స్థితి సాహితీవేత్తలను కలచివేస్తోంది. పుట్టినింట తెలుగు భాష వెలాతెలా పోతుండటం భాషాభిమానులకు ఆందోళనకరంగా మారింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీ జొన్నలగడ్డ రామలింగేశ్వరరావుగారు చెప్పిన కవిత- నీతిని రీతిని జాతికిడిన గురజాడ ప్రౌడ నా తెలుగు కోట సింగముల గర్జన లొకటవు శీశ్రీ నుడి నా తెలుగు సావిత్రి మోమున నటరాజు జపియించు గాయత్రీ మంత్రం నా తెలుగు రామారావు ధీర మనోహర నట విశ్వరూపం నా తెలుగు నింగీనేలను పకపక నవ్వించే రేలంగి హాస్యం నా తెలుగు భానుమతి సతి భావాభినయనముల రాగాల రసఝరి నా తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీతామాధురి నా తెలుగు ఆదిభట్ల నారాయణ దాసు చిరతల సవ్వడి నా తెలుగు చలనచిత్రములు ఛత్రం పట్టిన చిత్ర విచిత్రము నా తెలుగు స్వాతికాభినయ వాచకములకు శాశ్వత వేదిక నా తెలుగు అంటూ కవి తెలుగు భాషా విశిష్టతను ఎంత బాగా వర్ణించారో చూడండి. మా ఈ పుస్తకము ధృవతారలలో కూడా తెలుగువారి విశిష్టతను, విజ్ఞతను సంస్కృతీ సాంప్రదాయ వారసత్వాల విశిష్టతను భాషాసాహిత్య పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రముఖుల వ్యాసాలను సేకరించి ప్రచురించారు. చదివి ఆదరిస్తారనీ, తెలుగు భాషను బ్రతికించటానికి మీ వంతు కృషి చేస్తారనీ ఆశిస్తున్నాము.