Book Description
వృత్తిరీత్యా ఒక పోలీసు ఆఫీసర్‍గా నిరంతరం రకరకాల మనుషులతో నేరస్థులతో మసిలే మీలో సున్నితత్వం, భావుకత్వం నిలుపుకున్నందుకు ఆశ్చర్యంతో కూడిన సంతోషం! రాయటం ఒక్క ముక్క రాకపోయినా విపరీతంగా పుస్తకాలు చదువుతాను. ఒక రకంగా సాహిత్యాభిమానిని. గత కొన్ని సంవత్సరాలుగా త్వరత్వరగా మారుతున్న నైతిక విలువలతో పాఠకుల కోసమే రాస్తున్నామనే రచయితలతో, రచనా వ్యాసాంగాన్ని వ్యాపారంగా తీసుకునే ఎడిటర్లతో, మంచేదో చెడేదో తెలుసుకోలేని యువతతో, పాఠకులతో, పరస్పర నిందారోపణలతో కలుషితమైన ఈ సాహితీ సదస్సులో మీ ‘లక్షల్లో ప్రేమ’ ఠీవిగా రాజహంసలా తేలియాడుతున్నది. నవలా సాహిత్యంలో మంచి మార్పునకు ఇది శుభారంభం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇన్ని పాత్రలతో కథ నడపడంలో మీ అనుభవం మాకు తెలుపకనే తెలుపుతున్నది. శ్రీకాంత్ శర్వాణీల సెలయేటి గలగలలతో మొదలై గౌరీపతి, గరుడ, విలాసరావు, జార్జి, రఘు, శివరాం మొదలగు పిల్ల ఏరులతో ఏరువాకై ముందుకు సాగుతూ, సింధూర శ్రీనివాస్‍ల కలయికతో నదీ ప్రవాహమై కట్‍బాస్, సౌదామినిల సుడిగుండంలో చిక్కుకొని సాగరంతో సంగమించిన ‘లక్షల్లో ప్రేమ’ నిజంగానే నవలారంగంలో ఓ సరికొత్త వెలుగు!