Book Description
చాలాకాలంనాటి సంగతి. ఒకరోజు సాయం సమయాన అశ్వారూఢుడైన అందమైన యువకుడొకడు విష్ణుపురం నుంచి మందారన్ వెళ్ళే మార్గంలో ఒంటరిగా వెడుతున్నాడు. సూర్యాస్తమయం కాబోతున్నది. పైగా తుఫాను వచ్చే సూచనలుకూడా కనిపిస్తున్నాయి. ఇదిచూచి అతడు గుర్రాన్ని కొంచెం వేగంగా పరిగెత్తించాడు. కొంతదూరం వెళ్ళేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. ముందుదారి కన్పించటం మహా దుర్భరంగా వున్నది. మరికొంతదూరం వెళ్ళేప్పటికి మరల ఆకాశం మెరిసింది. ఆ వెలుతురులో అతనికి పాలరాతితో నిర్మితమైన దేవాలయం కనిపించింది. మెట్లెక్కి నెమ్మదిగా దేవాలయ ద్వారంవద్దకు వెళ్లాడు. కాని ద్వారాలు మూసి వున్నాయి. పరీక్షించి చూడగా అవి లోపలనుంచి మూసివేయబడినట్లు తెలిసింది. ఈ అడవిలో ఈ సమయాన, లోపల ఎవరో వున్నందుకు అతనికి ఆశ్చర్యమేసింది. తలుపులు తట్టాడు. కాని తెరవబడలేదు. అదేపనిగా బాదటం మొదలుపెట్టాడు. అప్పటికీ లాభం లేకపోయింది. అప్పుడు బాగా బలం వుపయోగించి ద్వారాలను గట్టిగా తోశాడు. దాంతో లోపలి గడియ వూడిపోయి తలుపులు తెరుచుకోబడ్డాయి. దేవాలయంలో ఏ దేవుని విగ్రహం వున్నదో, అక్కడ వున్న మనుషులెవరో, ఆ అంధకారంలో ఏమీ బోధపడలేదు. ఆ కన్పించని దేవుని విగ్రహానికి నమస్కారం చేసి లేచి నిలబడి ‘‘ఎవరక్కడ? దేవాలయంలో వున్నదెవరు?’’ అని బిగ్గరగా కేకవేసి అడిగాడు. కాని సమాధానం రాలేదు. ప్రతిధ్వని మాత్రం విన్పించింది. కాలాన్ని వ్యర్థం చేయడం అతనికిష్టంలేక వెళ్లి తలుపులు మూసి గడియకు బదులు తానే వీపును వాటికి ఆనించి అక్కడే చతికిలపడ్డాడు. ఇక చదవండి.