Book Description
‘‘రామి.. చనిపోతానంటే ఒకటేనే బాధ- నీవు అక్కడ వుండవని, నువ్వు లేని స్వర్ఘం కూడా నాకు శూన్యమేనే పిల్లా.’’ రామమ్మగారు భోరున ఏడ్చింది. ఇంతలో సభారంజని లోపలికి వచ్చింది. ఆమె హృదయంలో ఏ అగ్నిపర్వతాలు బ్రద్ధలవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఆమె సరాసరి వచిచ క్రిష్ణయ్యగారి కాళ్ళగట్ల నిలబడింది. ‘‘సభా వచ్చావా. నీ కోసమే ప్రాణాలు నిలుపుకున్నాను. ఏదీ నువ్వు పాడే మువ్వగోపాలపదం, మూడునాళ్ళాయెరా మువ్వగోపాలా, అని ఒకసారి పాడు.. ఎందుకే అలా దూరంగా నుంచుంటావు? ఇలా రా..’’ సభారంజని ముఖాన దుఃఖచిహ్నాలేమీ లేకపోవటం చూసి, రామమ్మగారు ఆశ్చర్యపోయింది. ఆమె మనసులో ఎంతయినా వేశ్య అనే తేలికభావం కూడా ఒకమూల మెదిలింది. సభారంజని క్రిష్ణయ్యగారి కాళ్ళగట్ల కూర్చని, ఆయన కాళ్ళు ఒళ్ళోకి తీసుకుంది. సభారంజని అమృత కంఠంలోంచి ‘మూడునాళ్ళాయెరా మువ్వగోపాలా’ అనే పాట మధురంగా ధ్వనించడం ప్రారంభించింది. ఆనందంగా పాట పూర్తిచేసి సభారంజని ఆయన కాళ్ళమీద వాలిపోయింది. ఆమె శరీరం చల్లగా చల్లచల్లగా తగిలింది. ఆయన కాళ్ళమీద పడివున్న వేశ్య శరీరం తాకటానికి అందరూ జంకారు. రామమ్మగారు లేచి సభారంజనిని ఇవతలకు తీసింది. ఆమె అప్పటికే చనిపోయింది. ఈమెనే తను ఇందాక వేశ్య అని మనసులో అసహ్యించుకున్నది. తరతరాలుగా పవిత్రతని అంటి పెట్టుకున్న ఆమె తల సిగ్గుతో క్రుంగిపోయింది. మృత్యువు కూడా ఆ వేశ్యని ఆయననించి విడదీయలేకపోయింది.