Book Description
పరమ సుందరమైన మోహనరాగం ఆలాపిస్తున్నది వారిజ. ‘‘వారిజా ఎపుడూ అదేరాగం ఆలపించటంలో నీ ఉద్దేశ్యం’’ అన్నాడు మోహనమూర్తి. ‘‘ఆ రాగం నాకు చాలా యిష్టం. ఆ రాగంలోనే నా బ్రతుకు ఇమిడి ఉన్నది’’ అని తిరిగి పాడటం ప్రారంభించిందామె. ‘‘ఆ రాగం నేను భరించలేను.’’ మోహనమూర్తి విసుగ్గా లేచి నిలబడి ఆమెను పిలిచాడు. ‘‘వారిజా’’ ‘‘ఏమిటి?’’ ‘‘ఏదయినా కొత్తరాగాన్ని పాడు.’’ ‘‘ఇవ్వాళ నాకు పాతపాటే పాడాలనిపిస్తున్నది.’’ చేతిలో ఉన్న వీణని బలంగా మీటింది వారిజ. ఒక తీగ తెగి విసురుగా వెళ్ళి మోహనమూర్తి చెంపకి తగిలింది. వారిజ కంగారుపడి అతని చెంపని అనుకోకుండా సృశించి చెయ్యి వెనక్కి తీసుకోబోయింది. మోహనమూర్తి తన చెంపమీదవున్న ఆమె చేతిని తియ్యనీకుండా తన చేతితో నొక్కిపెట్టి ‘‘వారిజా’’ అన్నాడు. ఆ ఒక్క పిలుపుతో వారిజకి తన బ్రతకుంతా జప్తికి వచ్చింది. ‘వారిజా’ ఆ పిలుపు తాన్ సేన్ గానమూ, కాళిదాసూ కవిత్వమూ కలిసిన ఒక మహాగీతిక. ఆ పిలుపు మహా గాయకుడు మోహమూర్తి పిలుపు. ‘‘వారిజా... వారిజా... వారిజా’’