Book Description
ఇలా తనని చూడడానికి ఎంత ధైర్యం వీడికి. కంటబడితే చాలు వీడి చూపులు తనను వెంటాడుతుంటాయి. తనని చూసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? ఎవరిచ్చారు వీడికి? అతడు ప్రతి సంవత్సరం తెచ్చుకుంటున్న ఫస్ట్ క్లాసా? తెచ్చుకుంటున్న గోల్డు మెడల్సా? నాన్నతో చెబితే వీడి గతేమౌతుంది? వీడినే కాదు, వీడితోపాటు వీడి కుటుంబాన్ని మెడపట్టి గెంటుతారు నాన్న ఆ ఇంట్లోంచి. ఇంతమాత్రానికి అంత పాపం తనెందుకు కట్టుకోవాలని ఎప్పటికపుడు క్షమించేసి ఊరుకుంటున్నది కాని లేకపోతే ఎపుడో వీడికి తగిన బుద్ధి చెప్పి ఉండేది. ఇది తనను ఎంతగానో ప్రేమించే అనిల్ పై ‘చండీ’ అభిప్రాయం. నీటిలో చేప జీవించినంత సహజంగా అనిల్ పేదరికంలో జీవిస్తున్నాడు. ఆ పేదరికాన్ని అతనిపాలిట భయంకర శాపంగా మార్చివేయాలి. ఆ పేదరికాన్ని అతడు అసహ్యించుకునేలా చేయాలి. అతనికి నిలువనీడ లేకుండా చేయాలి. ఆ అవమానంలో, ఆ ఆపదలో రక్షించడానికి ముందుకు వచ్చిన చేతిని అతడు త్రోసి వేయగలడా? అలా త్రోసివేసే శక్తిని అతడి నుండి తను దూరం చేస్తుంది. అతడిని తన ముందు, తన ధనం ముందు మోకరిల్లేలా చేసుకుంటుంది. తాను ప్రేమించిన అనిల్ పట్ల ‘ఆశ’ భావన ఇది. ఈ ముక్కోణపు ప్రేమికుల మధ్యలోకి అనిల్ కి అన్న రూపంలో వచ్చాడు నీల్. ఎలాగైనా చండీని తన తమ్ముడికిచ్చి పెళ్ళి చెయ్యాలని పంతం పడతాడు. ఏం చేసైనా అనిల్ ని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆశ. అన్నదమ్ములిద్దరిపై పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది చండీ.