Book Description
ఎయిర్ ఇండియా విమానం తెల్లని మేఘాల తెరలని తొలగించుకుంటూ కిందకు దిగుతోంది. కింద దట్టమైన అడవులతో, నదులతో, వాగులతో, చిన్నా పెద్దా పట్టణాలతో, పల్లెలతో పరచుకుని వున్న భూ ఖండం మలేసియా ద్వీపకల్పం. కిటికీ అద్దానికి తల ఆనించి అందమైన ఆ దృశ్యాన్ని చూస్తోంది రాధ. అవును. అది తన దేశం. తను పుట్టి పెరిగిన మలయా దేశం. ఐదారేళ్ళ ప్రాయం వరకు ఆడిపాడిన అందాల సుందర నందనవనం. రెండు దశాబ్దాలుగా కాలం తనని తనవారికి దూరం చేసింది. తన బ్రతుకును వారి జీవితాలకు భిన్నంగా మలచింది. ఆ క్షణంలో రాధకు ఇండియా, మలేసియా వేరు వేరు భూఖండాలుగా అనిపించలేదు. జననీ జన్మభూమి. అది ఒక భావన. అనుభవైక వేద్యమైన ఒక సుందర భావన. మనిషి మనిషికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చే అలౌకిక అనురాగ సుధామయమైన అమర భావన. అనంతమైన ఈ అనురాగ జగత్సాగరంలో తనొక బిందువు. దానితోపాటు తనూ పయనిస్తూనే వుంటుంది అనంతంగా... అవిరామంగా..