Book Description
అంధత్వం! శాశ్వత అంధత్వం! పుట్టుకనుంచీ గుడ్డివాడైన వాడికి భేదం తెలియదుకాని, తానీ కళ్ళతో చూసిన అనేక ప్రకృతిసౌందర్య దృశ్యాలు - వినీలాకాశం, లయతో వొచ్చిపడే సముద్రపుటలలు, అందమైన పువ్వులు, ఆహ్లాదకరమైన ప్రకృతిశోభ సూర్యోదయ సూర్యాస్తమయాల రంగులు, ఇంద్ర ధనుస్సులోని ఛాయలు, చల్లని చందమామ, వింత వింత రంగుల మేఘాలు, మానవ నిర్మితాలైన భవనాలు, ప్రశాంతంగా పారే నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టలు, మహాసముద్రాన్ని కూడా దాటేందుకు నిర్మించిన నౌకలు - అబ్బ ఎన్నని! వీటన్నిటినీ చూస్తూనే తనుకూడా ఒక నిర్మాత ఐతే బాగుండునని, తన అభిరుచుల ప్రకారం నిర్మించి ఆనందించవొచ్చని తలిచి, నిజజీవితంలో అది కుదరక, ఎన్ని కలల్ని సృష్టించుకున్నాడు! చూపులకందని అనేక దృశ్యాలు మనోవీధిలో పరుగెత్త గలిగినవంటే, వాటి పునాదులన్నీ యథార్థజీవితంలోనే ఉన్నవి. జీవితంలోని యీ యథార్ధమే దూరమవటంతో ఆ కలలుకూడా కరిగిపోతవి. త నింకేమీ చూడలేడు. ‘ఆహా! ఎంతబాగుంది!’ అని ఎవరైనా అనటం వింటే, అది నిజంగా ఎంత బాగుందో తెలియక, ఊహసాగక కొట్టుమిట్టాడుతాడు. ఏమైతేనేం గడిచిన తన పాతికేళ్ళ వయస్సూ యథార్థంగానూ, బతకాల్సిన ఆ భావిజీవితం, అది ఎంత తక్కువదైనాసరే, అది ఒక భ్రమగానూ, మిథ్యగానూ పరిణమిస్తుందేమో?